42నియోజకవర్గాల్లో త్వరలో ఇండస్ట్రియల్ పార్కులు.. ఇక అన్ స్టాపబుల్ గా అమరావతి అభివృద్ధి : సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూటమి నేతలకు చంద్రబాబు సూచించారు.

CM Chandrababu Naidu: త్వరలోనే రాష్ట్రంలోని 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేద్దాం.. అమరావతి అందరిది, రాష్ట్రానికి ఆత్మవంటిదని చంద్రబాబు అన్నారు. రాజధాని పున:నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిపోసినట్లవుతుందని, ఇప్పటికే అభివృద్ధి మొదలైంది, ఇక అన్ స్టాపబుల్ గా అమరావతిలో అభివృద్ధి ముందుకెళ్తుందని అన్నారు. అమరావతితో పాటు ఏపీ అభివృద్ధిపైనా దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు.
Also Read: GVMC: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక..
విశాఖపట్టణంలో ఆర్సెలర్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దీంతో విశాఖ అత్యధిక ఉక్కు తయారు కేంద్రంగా మారుతుందని చంద్రబాబు తెలిపారు. తిరుపతిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని, అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని చెప్పారు. మేకిన్ ఇండియా కింద 500 బిలియన్ డాలర్ల తయారీ పరిశ్రమలు రానున్నాయి. డ్రోన్ రంగం ప్రాధాన్యత గుర్తించి ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఓర్వకల్లులో శాటిలైట్ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీయల్ పార్కులు రాబోతున్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూటమి నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.